అందాల నెలవు.. సాహసాల కొలువు

అందాల నెలవు.. సాహసాల కొలువు

అందాల నెలవు.. సాహసాల కొలువు

తెలంగాణలోనే అత్యంత ఎత్తైన జలపాతం..రెండు కొండల మధ్య పాల నురగల్లా గలగల పారుతూ సవ్వడి చేస్తూ సాగుతుంది. చూపరులను కట్టిపడేస్తూ ముగ్ధమనోహరంగా కనబడుతుంది. పచ్చని అందాలతో లోయల్లో ఒదిగి ఉండే ఆ జలపాతం ఇప్పుడు ఓ సాహస క్రీడకు వేదిక కాబోతోంది. అత్యద్భుత అందాల నడుమ ఉన్న ఆదిలాబాద్ గాయత్రి జలపాతం వాటర్ రాపెల్లింగ్ సన్నాహక ప్రపంచకప్‌కు వేదిక కానుంది. 
ఆ పచ్చని అడవి తల్లి అందమైన ఒడిలో మునిగి తేలడానికి సిద్ధమవ్వండి.. కౌంట్ డౌన్ మొదలైంది!

ఆదిలాబాద్ జిల్లా అంటే అందాల జలపాతాలకు పెట్టింది పేరు. జిల్లాలో చిన్నా పెద్ద కలిపి దాదాపు 20 జలపాతాల వరకు ఉన్నాయి. అయితే, ఒకటి రెండు మినహా మిగిలినవి చాలా మందికి తెలియదనే చెప్పాలి. గత ప్రభుత్వాలు వీటి గురించి కనీసం పట్టించుకోకపోవడం ఒక ఎత్తైతే.. అందాల అడవుల్లో దాగిపోయి ఉండటం మరో ఎత్తు. చాలా ప్రాంతాల్లో ఉన్న జలపాతాలకు వెళ్లాలంటే కనీసం కాలిబాట కూడా లేని దుస్థితి. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం వీటిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గాయత్రి జలపాతం వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఇచ్చోడ మండలంలో ఉందీ జలపాతం. ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా తెలంగాణలోనే అతిపెద్దదిగా పేరొందింది. దీంతో ఇప్పుడు చాలామంది సాహసికులను ఇది ఆకట్టుకుంటున్నది. 

తెలంగాణ రాష్ట్ర అడ్వెంచర్ క్లబ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వాటర్ రాపెల్లింగ్ పోటీలను నిర్వహిస్తుంటారు. 2011 నుంచి దేశవ్యాప్తంగా ఈ పోటీలు సాగుతున్నాయి. గతంలో కుంటాల జలపాతం వద్ద రాఫ్టింగ్, బెలూనింగ్, క్యాపింగ్ టెంబ్స్ పోటీలు ఏర్పాటు చేశారు. అయితే కుంటాల జలపాతం చాలా తక్కువ ఎత్తులో ఉంటుంది. దీని ఎత్తు కేవలం 135 అడుగులు మాత్రమే. ఈ నేపథ్యంలో సాహసికుల కన్ను ఎత్తైన గాయత్రి జలపాతం పైన పడింది. ఇది ఎత్తైన జలపాతం కావడంతో ప్రీ ప్రపంచ కప్ వాటర్ రాఫెల్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా 12 కేటగిరీల్లో ఈ పోటీలు కొనసాగుతాయి. తాళ్ల సాయంతో జలపాతం పైకి ఎక్కడం, అదే విధంగా అపసవ్య దిశలో దిగడం, కళ్లకు గంతలు కట్టుకుని తాళ్ల సాయంతో ఎక్కడం ఇలా అన్ని రకాలుగా పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

దాదాపు మూడు వందల మంది జాతీయ, అంతర్జాతీయ ఔత్సాహికులు ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఇందులో కూడా 12 నుంచి 16 సంవత్సరాల వరకు జూనియర్ బాలబాలికలు, 17 నుంచి 50 సంవత్సరాల వరకు సీనియర్ పురుషులు, మహిళల బృందాలు, 50 సంవత్సరాలు దాటిన వారితో వెటరన్ బృందాలు ఏర్పాటు చేస్తారు. ఒక్కో బృందంలో 12 మంది ఉంటారు. మొత్తం 25 బృందాలు పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంది. సెప్టెంబర్ ఏడు నుంచి తొమ్మిదో తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. 
 

రూట్ డైరెక్షన్..


ఈ జలపాతం చేరుకోవాలంటే కాస్తంత సాహస యాత్ర చేయాల్సిందే! ఈ జలపాతం హైదారాబాద్ నుంచి దాదాపు 250 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి నిర్మల్‌కు 210 కిలోమీటర్లు. నిర్మల్ నుంచి ముఖరం అనే గ్రామం వద్దకు వెళ్లాలి. అది 36 కిలోమీటర్లు ఉంటుంది. ముఖరం అనే గ్రామం నుంచి కాలినడకన వెళ్లాలి. దాదాపు ఐదు కిలోమీటర్లు ఉంటుంది. కాస్తా ఓపిక చేసుకుని వెళితే కచ్చితంగా అంతకు మించిన ఆనందం మనకు ఎక్కడా లభించదు అనిపించనంతగా కనువిందు చేస్తుందీ జలపాతం. అక్కడికి వెళ్లే వారు నిర్మల్‌లోనే ఏదైనా ముందుగా తినడానికి ఇతరత్రా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏదిఏమైనా అందాల జలపాతం వాటర్ రాపెల్లింగ్ ప్రీ వరల్డ్ కప్ పోటీలకు వేదిక కావడంతో మరింత మంది పర్యాటకులను ఆకర్షించనుంది.